logo

బుగ్గారం జిపి లో రికార్డుల మాయాజాలం...? 2014 నుండి 2017-18 రికార్డులు ఎక్కడ...? ముచ్చటగా ముడిపడని ముగ్గురు డిఎల్

బుగ్గారం జిపి లో రికార్డుల మాయాజాలం...?

2014 నుండి 2017-18 రికార్డులు ఎక్కడ...?

ముచ్చటగా ముడిపడని ముగ్గురు డిఎల్ పివో ల విచారణ

నలుగురు డిపివో లు మారినా రికార్డులు స్వాధీనం చేసుకోని వైనం...?

నేటికీ సరిగా లెక్కలు తేల్చని జిల్లా అధికార యంత్రాంగం...??

అధికారులను కాపాడేందుకే
రికార్డుల మాయాజాలం తెరపైకి...???

బుగ్గారం / జగిత్యాల జిల్లా:


జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంలో రికార్డుల మాయాజాలం నెలకొని ఉందని ఉన్నతాధికారుల నివేదిక చెబుతోంది.

ఇప్పటివరకు ముచ్చటగా ముగ్గురు డివిజనల్ పంచాయతీ అధికారులు బుగ్గారం జీపి నిధుల దుర్వినియోగం పై విచారణ చేపట్టారు. ఆ ముగ్గురి విచారణ కూడా నేటికీ ముడిపడడం లేదు. నలుగురు జిల్లా పంచాయతీ అధికారులు మారినా కూడా బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగం పై చట్టబద్దంగా సరైన చర్యలు చేపట్టక పోవడం అతిశయోక్తి గా మారింది.
గ్రామస్తుల పిర్యాదు మేరకు
మొదటిసారి విచారణ 2020 సెప్టెంబర్ 17న అప్పటి డీఎల్పివో ప్రభాకర్ చేపట్టారు. సక్రమంగా రికార్డులు, సరైన
బిల్లులు, సరైన తీర్మానాలు, సరైన అనుమతులు లేని వాటిని గుర్తించి కొంతవరకు నిధుల దుర్వినియోగాన్ని బట్టబయలు చేశారు.
సర్పంచ్ మూల సుమలత - శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ చుక్క శ్రీనివాస్, గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా, జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎస్ నరేందర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి కొంత సొమ్ము రికవరీ కూడా చేశారు. కానీ ఉన్నతాధికారులు చట్టపరంగా ఎలాంటి చర్యలు గైకొనలేదనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.

రెండోసారి విచారణ 2022 జూన్ 28న అప్పటి డివిజనల్ పంచాయతీ అధికారిణి కనకదుర్గ 15 పిర్యాదులపై విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో కూడా రికార్డుల ప్రకారం కొన్ని పనులను మాత్రమే ఆమె ప్రత్యక్షంగా ప్రజా క్షేత్రంలో పరిశీలించారు. గ్రామస్తులంతా బుగ్గారం బస్టాండ్ లో ఈపాలక వర్గం బోర్ వేయలేదని, మంచినీళ్ళ బావికి ఎలాంటి పనులు చేయలేదని ముక్తకంఠంతో ఆమెకు తేల్చి చెప్పారు. కానీ ఆ పనులపై లక్షలాది రూపాయల నిధులు డ్రా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. విచారణ అధికారిణి కనకదుర్గ ప్రజా క్షేత్రంలో రుజువైన నిధుల దుర్వినియోగాన్ని కూడా కప్పిపుచ్చారు. చేయని పనులకు దొంగ బిల్లులు, రికార్డుల సమర్పణను ఆమె సమర్ధించారు. ఇట్టి విషయమై అదే గ్రామస్తుడు చుక్క గంగారెడ్డి డిఎల్ పివో కనకదుర్గ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసి సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే తప్పుడు, దొంగ రికార్డులు సృష్టించారనే అభియోగం తో
ఆర్ డబ్లూఎస్ ఇంజనీర్ అధికారి వివేకానంద్ పై కూడా పిర్యాదు చేసి ఆయన పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఇక మరోసారి పలు పిర్యాదుల మేరకు బుగ్గారం జీపీ నిధుల దుర్వినియోగం పై
మూడో సారి విచారణ స్థానికేతర అధికారి అయిన మెట్ పల్లి డిఎల్ పివో శ్రీనివాస్ 2023 మార్చ్ 14న చేపట్టారు. ఈ విచారణ నివేదికలో గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా
2014 నుండి 2017-18 వరకు కాష్ బుక్ రికార్డులు ఇవ్వలేదని, ఆయనను వివరణ కోరగా మూడు రోజులలో రికార్డులు సమర్పించ గలనని వాంగ్మూలం సమర్పించినట్లు నివేదికలో పేర్కన్నారు. ఇప్పటి వరకు రికార్డులు ఇవ్వకపోతే బుగ్గారం గ్రామ పంచాయతీ పాలక వర్గం గానీ, అధికారులు గానీ, ఉన్నతాధికారులు గానీ, ఆడిట్ అధికారులు గానీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని, చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని బుగ్గారం వాసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
నిధుల దుర్వినియోగాన్ని కప్పి పుచ్చిన డిఎల్ పివో కనకదుర్గ ను, తప్పుడు, దొంగ ఎంబి రికార్డులు సృష్టించిన
ఆర్ డబ్లూఎస్ ఇంజనీర్ అధికారి వివేకానంద్ లను, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులను కాపాడెందుకే తాజాగా రికార్డుల మాయాజాలం ప్రస్తావన తీసుకొచ్చి గత పంచాయతీ కార్యదర్శి మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు బుగ్గారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పుడు నివేదికలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా 2014 నుండి 2017-18 రికార్డులు ఎక్కడ ఉన్నాయో...? వెంటనే దొరుకబట్టి, సరిగా లెక్కలు తేల్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారందరిపై, అందుకు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం ను బుగ్గారం ప్రజలు కోరుతున్నారు.


122
1292 views